దాన వీర శూర కర్ణ dialogues
Dialogues from the telugu movie daana veera soora karna by NTR
సుయోధన పరితాపం- మయసభ
పాంచాలీ.. పంచభర్త్రుక.. ఏమే.. ఏమేమే.. నీ ఉన్మత్త వికటాట్టహాసము ?
ఎంత మరువ యత్నించినను మరపునకురాక- హృదయ శల్యాయమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవే.
అహో ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహోత్తమ- క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యధౌరేయుండనై
నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు- శతసోదరులక గ్రజుండనై ...
పరమేశ్వర పాదాభిరత పరశురామ సద్గురుప్రాప్త- శస్త్రాస్త్రవిద్యాపారీణుండైన- రాధేయునకు మిత్రుండనై..
మానధనుడనై- మనుగడ సాగించు -నన్ను చూచి ఒక్క ఆడుది- పరిచారికా పరివృతయై పగులబడి నవ్వుటయా ? అహో !
తన పతులతో తుల్యుడనగు నన్ను భావగా సంభావింపక, -సమ్మానింపక.. గృహిణీధర్మ పరిత్యక్తయై.. లజ్జావిముక్తయై.. ఆ బంధకి -ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?
అవునులే.. ఆ బైసిమాలిన భామకు- ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున -మగలముందొక మగని- వత్సర పర్యంతము రెచ్చిన కడుపిచ్చితో -పచ్చిపచ్చి వైభవముల తేలించు- ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?
ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో- మోరెత్తి కూతలిడునా ! అని సరిపెట్టుకొందునా! ఆ ! ఈ లోకము మూయ మూకుడుండునా !
ఐనను -దుర్వ్యాజమున సాగించు- యాగమని తెలిసి తెలిసి మేమేల రావలె ... వచ్చితిమి పో!
నిజరత్నప్రభా సముపేతమై- సర్వర్త్రు సంశోభితమైన -ఆ మయసభాభవనము -మాకేల విడిది కావలె.. అయినది పో !
అందు చిత్రచిత్రిత- విచిత్ర లావణ్య లహరులలో- ఈదులాడు దిదృక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ... కలిగినదిపో !
సజీవ జలచర సంతానవితానంబులకాలవాలమగు- ఆ జలాశాయమున మేమల కాలు మోపవలె .. మోపితిమిపో !
సకల రాజన్యకోటీరకోటీ సంప్రక్షిప్త- రత్నప్రభా నీరాజితంబగు- మాపాదపద్మమేల అపభ్రంశమందవలె..
ఏతత్సమయమునకే- పరిచారికాపరీవృతయైన -ఆపాతకి పాంచాలి యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ? ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..
ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము- అవమాన బడబానల జ్వాలలు- ధగ్ధమొనర్చుచున్నవి మామా..
విముఖునిసుముఖునిజేసి -మమ్మటకు విజయము చేయించిన -నీ విజ్ఞాన విశేష విభావాధిక్యములు- ఏమైనవి మామా?
పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై -మర్యాదాతిక్రమణముగా మనుటయా… పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక -మరణించుటయా..
ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక- అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి- ఆపైన వేరొకటియా... ఇప్పుడేదీ కర్తవ్యము ? మనుటయా? మరణించుటయా ?
దుశ్శా:- పాంచాలీ పరాభవము..మయసభా విధ్వంసము..పాండవ వినాశము
అస్త్ర విద్యా పరీక్ష:
దుర్యో:- ఆగాగు! ఆచార్యదేవా! హహ్హ ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా ! ఎంత మాట, ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ? కాదు, కాకూడదు, ఇది కులపరీక్షయే అందువా ! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?
మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము?
ఇంతయేల, అస్మత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనిoచలేదా ! ఈయన దే కులము ?
నాతో చెప్పింతువేమయ్యా , మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశీపుత్రుడు కాడా?
ఆతడు పంచమజాతి కన్యయగు అరుంధతియందు శక్తిని, ఆశక్తి ఛండాలాంగనయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో- ధర్మనిర్మాణచణుడని మీచే కీర్తింపబడుచున్న- హ.. ఈ విదురదేవుని కనలేదా?
సందర్భావసరములనుబట్టి క్షేత్రభీజప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము- ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదమెందులకు?
భీష్మ:- నాయనా సుయోధనా! ఏరుల, పారుల, బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవికావు. ఇది, నీవన్నట్లుగా, ముమ్మాటికీ క్షాత్ర పరీక్షయే! క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే! వారిలో రాజ్యమున్న వారే రాజులు! అట్టి యీ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు!
దుర్యో:- ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది. అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపద్గ్రామమై వెలుగొందు, అంగరాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.
